Posts

Showing posts from June, 2024

అకాల వర్షం

అకాల వర్షం అకాల వర్షం అకాల వర్షం కురిసింది.. మేడలు మిద్దెలు సన్నని దారులు నింగిని నేలను ఏకం చేస్తూ అకాల వర్షం కురిసింది.. అకాల వర్షపు నిశీధి బాటన ఎండీఎండని చిటారు కొమ్మన తడితడి రెక్కల బేలచూపులతొ బిక్కుబిక్కుమన కూర్చుని భయపడెనో పాలపిట్ట.. తోటి పిట్టలు సాటి పక్షులు వదలిపోగా మరచిపోగా.. అకాల వర్షపు మెరుపులవెలుగున కృష్ణమేఘముల భీకరగర్జనన జీవనగమనం కనిపించింది జీవితసత్యం నలుదిక్కులన.. వినిపించింది ధ్వనియించింది దిగంతరాళములు దద్దరిల్లేలా ప్రతిధ్వనియించింది తనతో పెరిగిన తనతో నడిచిన తనతో ఆడిన పక్షులు లేవని తనతో రావని ఒంటరి పక్షి వగచింది.. వర్షపుచినుకుల కలిసి కారిన కన్నీటినిగని నగియింది.. నిశీధివేళన నిద్దురవదిలి బంధాలన్నీ నీడగతలచి కోటలువదిలి ఊళ్లనువదిలి సత్యాన్వేషణమార్గంతెలిసి అన్నీ త్యజించి తననే జయించి సిరివాహనమీ అర్భకపక్షికి  ఆశ్రయమైంది  ఆయువయింది.. అకాలవర్షం అకాలవర్షం  అకాలవర్షం కురిసింది సత్యం తెలుపుతు సర్వం కలుపుతు గంభీరంగా సాగింది జీవనపాఠం నేర్పింది జీవితచిత్రం చూపింది… ~ చలం