Posts

Showing posts from 2024

అకాల వర్షం

అకాల వర్షం అకాల వర్షం అకాల వర్షం కురిసింది.. మేడలు మిద్దెలు సన్నని దారులు నింగిని నేలను ఏకం చేస్తూ అకాల వర్షం కురిసింది.. అకాల వర్షపు నిశీధి బాటన ఎండీఎండని చిటారు కొమ్మన తడితడి రెక్కల బేలచూపులతొ బిక్కుబిక్కుమన కూర్చుని భయపడెనో పాలపిట్ట.. తోటి పిట్టలు సాటి పక్షులు వదలిపోగా మరచిపోగా.. అకాల వర్షపు మెరుపులవెలుగున కృష్ణమేఘముల భీకరగర్జనన జీవనగమనం కనిపించింది జీవితసత్యం నలుదిక్కులన.. వినిపించింది ధ్వనియించింది దిగంతరాళములు దద్దరిల్లేలా ప్రతిధ్వనియించింది తనతో పెరిగిన తనతో నడిచిన తనతో ఆడిన పక్షులు లేవని తనతో రావని ఒంటరి పక్షి వగచింది.. వర్షపుచినుకుల కలిసి కారిన కన్నీటినిగని నగియింది.. నిశీధివేళన నిద్దురవదిలి బంధాలన్నీ నీడగతలచి కోటలువదిలి ఊళ్లనువదిలి సత్యాన్వేషణమార్గంతెలిసి అన్నీ త్యజించి తననే జయించి సిరివాహనమీ అర్భకపక్షికి  ఆశ్రయమైంది  ఆయువయింది.. అకాలవర్షం అకాలవర్షం  అకాలవర్షం కురిసింది సత్యం తెలుపుతు సర్వం కలుపుతు గంభీరంగా సాగింది జీవనపాఠం నేర్పింది జీవితచిత్రం చూపింది… ~ చలం

కన్నీటి చుక్క

కనుల రెప్పల నడుమ కల్లోల కావ్యం భాషకందని కటువైన నిగూఢ సత్యం ఘనీభవించిన నీటిని నింపుకున్న కనులు బీటలువారాయి కుంభించిన గాలిని మోస్తున్న నాసికా రంధ్రాలు బరువెక్కాయి అనుకోని ఘటనలకు అలవాటవ్వని ప్రాణం విలవిలలాడింది మౌనదీక్షలో అలసిన పసివాని పయనం మూగబోయింది ఆవేశము, ఆలోచనల నడుమన మొదలైన ఘర్షణల ఒరిపిడికి జనియించిన ఒక నీటి చుక్క ఏరులా పారుతూ ఆవేశాన్ని చల్లారుస్తూ బీటలు వారిన మదిని సస్యశ్యామలం చేస్తూ మూసిన కనుల నుండి జాలువారింది ఆవేశం పై ఆలోచన గెలిచిన వేళ కన్నులు వర్షించాయి నాసిక రంధ్రాలు బూరలు ఊదాయి హృదయ కవాటాలు జయ జయ ధ్వానాలు చేశాయి మౌనం యోగం అయ్యింది విశాల వీధిలో నిలబడిన నా మిత్రుడు ఏడుస్తూ నిలిచాడు ఆవేశాన్ని జయించి బంధాలను గెలిచాడు ~చలం

చితికిన బ్రతుకులు

పలుచటి చొక్కా చిరిగిన ధోతి జీవము లేని జుట్టు ఆశలు లేని కళ్ళు ఎముకల గూడు శరీరం మోయలేని భారంతో కృంగిన భుజాలు జీవితంతో పోరాటం చేస్తుంటే దారిద్యంతో కదలలేని కాళ్ళు కాలచక్రంలో పరుగెడుతూ తడబడుతున్నాయి పది నూర్ల విలువైన మందుల చీటి ఒక చేతిలో ఐదు నూర్ల విలువైన కాగితం మరొక చేతిలో సగం బ్రతికిన బ్రతుకులు పూర్తికావడానికి కూడా ఆలోచిస్తున్నాయి ~చలం