కన్నీటి చుక్క

కనుల రెప్పల నడుమ

కల్లోల కావ్యం

భాషకందని కటువైన

నిగూఢ సత్యం


ఘనీభవించిన నీటిని

నింపుకున్న కనులు బీటలువారాయి

కుంభించిన గాలిని

మోస్తున్న నాసికా రంధ్రాలు బరువెక్కాయి

అనుకోని ఘటనలకు

అలవాటవ్వని ప్రాణం విలవిలలాడింది

మౌనదీక్షలో అలసిన

పసివాని పయనం మూగబోయింది


ఆవేశము, ఆలోచనల

నడుమన మొదలైన ఘర్షణల

ఒరిపిడికి జనియించిన

ఒక నీటి చుక్క

ఏరులా పారుతూ

ఆవేశాన్ని చల్లారుస్తూ

బీటలు వారిన మదిని

సస్యశ్యామలం చేస్తూ

మూసిన కనుల నుండి జాలువారింది


ఆవేశం పై ఆలోచన గెలిచిన వేళ

కన్నులు వర్షించాయి

నాసిక రంధ్రాలు బూరలు ఊదాయి

హృదయ కవాటాలు జయ జయ ధ్వానాలు చేశాయి

మౌనం యోగం అయ్యింది


విశాల వీధిలో నిలబడిన నా మిత్రుడు ఏడుస్తూ నిలిచాడు

ఆవేశాన్ని జయించి బంధాలను గెలిచాడు


~చలం

Comments

Popular posts from this blog

తాండవ ప్రార్థన

నేను చూసిన నిజాలు

శై'శవం'