శై'శవం'
భ్రూణహత్యల కాలగతినే దాటివచ్చిన గట్టిపిండం
పరంధాముని దీవెనలచే బయటపడిన చిట్టి కమలం
లక్ష్మి నెరుగక వదిలి పెట్టిన కరుడుకట్టిన మాతృ హృదయం
పచ్చలారని బాల శిశువుకు శైశవo ఒక శవం
తల్లి పాలకు నోచుకోని, పిల్ల ఆకలి ఎడుపైతే
కుప్పతొట్టేన విసిరికొట్టిన, పాలు పెరుగును ఆరగించి
ఆకలెరుగక నిద్రపోయిన చిట్టి శిశువును చూసినట్టి
కాలభైరవ రూపమొక్కటి కాపుకై తన జతనుగట్టే
చిట్టి శిశువుకు కుక్క తోడై తండ్రి స్థానము తీసుకుంటే
బేల చూపుల చిట్టి జాబిలి క్రమము క్రమముగ పెరుగుతుండే
పెరుగుతున్న చిట్టి జాబిలి చూడనున్నది గ్రహణం
మధువు మరిగిన రాహువొక్కటి రెండు కాళ్ళతో సంచరిస్తూ
తప్పటడుగుల శబ్దములతో చిట్టి జాబిలి చెంతజేరే
మదపు చెమటల దుడుకు చర్యకు మచ్చలెరుగని చిట్టి జాబిలి
నీలమైపోయే, శరీరం చల్లబడిపోయే
తెలిసి తెలియని చిన్ని వయసున కన్న ప్రేమకు దూరమై
మృగపు ప్రేమను చొరగొన్నా, మనిషి చేష్టకు లోకువై
శైశవమునే చిట్టి జాబిలి నేల విడిపోయే
శైశవమునే చిట్టి జాబిలి శవము అయిపోయే
~ చలం లక్కాప్రగడ
Comments
Post a Comment