కర్ణ వియోగం

‌క: దాతా

సు: హితుడా

క: దాతా, కురు సామ్రాజ్య పట్టాభిషిక్తుడిని చేస్తానని, పాండవ మధ్ముడయిన అర్జున సంహారం చేస్తా అని, కురుక్షేత్ర సంగ్రామ సమయమున నీ అండగా నిలిచి వైరి తలలుతెగతార్చి విజయలక్ష్మీ పంచన చేర్చేదనని ఉత్తర ప్రగల్భాలు పలికి రుధిరరణభూమిన నిస్సత్తువతో నిలబడలేక మృత్యులోగిలికై ఎదురుచూస్తున్న ఈ దుర్భలుని క్షమించగలవా.

సు: హితూడా! కుచిత పాండవ కాంత వల్ల జరిగిన అవమాన భారము మేరునగ రీతిన పెరిగినదై, రాజ్య కాంక్ష తో, ధర్మాధర్మ విచక్షణరహితుడనై, నీవెరుంగని జూదమున నిన్నే నిలపి, మాతాపితురులు, పితామహులు, గౌరవ గురువులు, మిత్రులు, సహోదరులు, వేయేల జనుల నడుమ ఏకవస్త్రయైన కాంతను కురులపట్టి ఈడ్చి ఈ కురుక్షేత్రమను మహా దావానలము రగిలించితిని. ఈ ఘాడాగ్నికీలలు కురు సామ్రాజ్య లక్ష్మిని, బంధు భాందవులని, గురువులు గురుపుత్రులని, సహ ఉదరులని, నా మానసంబున నెలవైన నిన్ను దహించి వేయు సమయమున మూగ సాక్షిగా నిలిబడి చూస్తున్న దౌర్భాగ్యుడిని. గాండీవ ధరుని ఎదుర్కొనగల ధనుర్వేదివని ఎరిగి
ఈ పాప లంపటములోకి ఈడ్చిన ఈ మిత్రద్రోహి నీ సముఖమున తల వంచి నిలబడి క్షమార్పణ కోరుతున్నాడు.

క: అపర సూర్య ప్రకాశుడనై, సహజ కవచ కుండలా జనితుడైన నన్ను గంగపాలు చేసిన స్త్రీని మరపించేలా రధికుల పంచ పెరిగిన ఈ రధికుని ఆదరించి, కులభావమును మరచి రాచకుల పరీక్షాస్థలిన నా విద్య గ్రహించి, తరతరాల మనుస్మృతి విడచి, తదుపరి తరములకు దార్శనికునివై అంగరాజ్యమోసగిన దాతా... ఈ మహా సంగ్రామంలో నీ సైనికుడనై, ఈ రణరంగమున మార్తాండుడనై, అరివీర పరాక్రమముతో శత్రుచేధం చేయివేళ, క్షమయా ధరిత్రి అని కొనియాడే ధర కన్నెర్ర చేయగా ఏర్పడిన నెర్రలలో రధ చక్రము కృంగి, విద్యనిచ్చిన గురుదేవుల శాపఫలమున ధనుర్వేదము స్ఫురణకు రాక, రధ సారధి కులగ్రస్తుడనని విడువగా, అస్త్రములు త్యజించి రధ చక్రము పైకెత్తు వేళ, ధర్మాధర్మములు మరచి, దేవరాజుకు కవచ దానము చేసిన విషయమునెరిగి, కపట కృష్ణగీతా మైకము ఆవరించిన పార్ధుడు చేసిన దనుర్పాహారముల ధాటికి తుత్తునియలయిన శరీరముతో కూలబడితి.

సు: హితుడవై, స్నేహితుడవై, సోదరుడవై, ఆప్తుడవై, అంగ రక్షకుడవై, రణరంగ సైనికుడవై, దానగుణప్రపూర్ణడవై, నాకై అన్నీ నీవైన నేస్తమా, ఏమిచ్చి ఈ అల్పుడు నీ ఋణమును తీర్చుకొనగలడు. హా, నిను బలిగొన్న ఆ కుంతీ ప్రథముడైన ధర్మజుని, వ్రుకోదరుడూ వదరబోతు అయిన ఆ భీమసేనుని, దనుర్విద్యా మదోన్మత్తుదైన ఫాల్గుణ నామధేయుడిని, తుచ్చ పశుపాలకులు నకుల సహదేవులను నా చండ ప్రచండ గదాగాథ ప్రహారములతో కుళ్ళబొడిచి నరకయాతన చూపెద. అటుల కానీ ఎడల ఈ సుయోధనుడు నీ వెనుకనే వీరస్వర్గమునలంకరించి నా హితుని సహవాసము మనసారా చేసెదను.

క: దాతా. ఎన్నడూ అడిగిన వారికి లేదని ఇచ్చిన ఈ రాధేయుడు నీ సముఖమున మరోసారి చేయిజాచి అడుగుతున్నాడు. ఈ రుదిరమున మృత్యు దేవతకై ఎదురుచూస్తున్న ఈ ఆప్తుని నీ అక్కున చేర్చుకుని యాతన తొలగించి నాకు ముక్తిని ప్రసాదించు. ఈ జీవమును జీవచ్చవముగా మిగల్చక పరమపదసోఫానముము కలిగించుము. దాతా, మరు జన్మమున మరల నీ స్నేహహస్తమును అందుకొనగల అదృష్టమును నాకనుగ్రహించి ఈ కాయమును పరమాత్ముడయిన శివునిలో ఐక్యము చేయవలసింది. దాతా, ఈ రాధేయుని ఆఖరి ప్రణామము అందుకొనుము. దాతా... దాతా... దాతా.........



Inspired by RANGAMARTHANDA sequence

~ చలం లక్కాప్రగడ

Comments

Popular posts from this blog

తాండవ ప్రార్థన

నేను చూసిన నిజాలు

శై'శవం'