Posts

Showing posts from 2023

నేను చూసిన నిజాలు

కదిలే అలలు అలలపై తేలే కలలు ఆశగా ఎగిరే పక్షుల సంగీతం హాయిగా నవ్వే పిల్లల నవ్వులోని మకరందం చిన్ని చిన్ని దారులు ఆ దారులలో జనుల పరుగులు బ్రతుకుకై మనుషల పోరాటం ఎగరలేక ఆగిపోయే పక్షుల ఆరాటం ఆకలితో ఆశగా ఎగిరే పక్షులను  చేతిలో గింజలతో వశపరచుకునే మానవ నైజం. మనిషికి పక్షులు లోకువ మనిషికి మనిషే లోకువ మూసుకున్న కంటి నుండి జాలువారిన గంగా ప్రవాహం గంగమ్మ సుడుల ఒరిపిడికి ఎర్రబడ్డ శుక్లపక్ష చంద్ర బింబం ~ చలం

బావుటా

ఆవేశపు ఆక్రందన వినిపించిన వేదం కల్లోలపు మదియంచున కలిగిన నిర్వేదం వినిపించని ఎదచప్పుడు పలికించిన కావ్యం మూసిన కనురెప్పలలో కనిపించే ఒక సత్యం విశాల విశ్వం అంచుల చివరన నిలిచున్న ఓ మిత్రమా మాటలనే వర్ష బాణ వాడి ములుకులు గ్రుచ్చిగ్రుచ్చి చిద్రమైన ఛత్రమువలె పడి నిలిచిన నేస్తమా జగతి గతి అర్ధమవ్వక అస్తమించిన సోమమా తెలుసుకోరా తెలిసి తెలియని ఈ లోకం పోకడ నేర్చుకోరా నివ్వెరపరచే ఈ జీవన చలనం వెలుగు నీడల నడుమ నలిగే ఎరుపు నెత్తుటి సంద్రం ఉరుకుతున్నది ప్రజ్వరిల్లిన జ్ఞానజిలుగుల దీపం సత్య ధర్మముల భేధమేరిగి మానవత్వపు మర్మమెరిగి నిలువరా ఈ ధరన వెలిగే భాను దీపపు జ్యోతివై నిలుపరా నీ వెలుగు బావుట అంధకారాపు అవనిపై ~ చలం

ఆలోచన

పుర్రేయందున పుట్టి క్షణకాలమున బెరిగి అతిశయించుచు పవన వేగంబు కూడి రక్తచలనంబుతోడ తనువంత చేరి దెందమును పలువిధముల రెచ్చగొట్టేవు నొకచోనానందము నొకచోనాందోళన నొకచోనుద్రేకము నొకచోనుత్సాహము నొకచోనుత్తేజము నొకచోనిస్సత్తువ అనాలోచితంగా జనించిన ఆలోచనా నీకు వందనం ~ చలం లక్కాప్రగడ

గమ్యం

గమ్యం మొదలు కాని పయనం దిశలు లేని గమ్యం అలవి కాని మార్గం కదలలేని చలనం ఆశలన్ని పదిలం ఊహాలన్ని జటిలం మనసులోని కదనం గెలవకుంటె రుధిరం కదులుతున్న కాలం కలిసిరాని తీరం ఎదురీతిక తధ్యం సాధించుట సాధ్యం ~ చలం లక్కాప్రగడ

తాండవ ప్రార్థన

వ్యాఘ్రాంభరధర త్రిశూలపాణి నర్తించెడు ఈ ప్రదోష సమయమున రివ్వు రివ్వుమను జటాఝాటము లయబధ్ధముగా ఎగురుచుండగ ఢమ ఢమ ఢమ ఢమ పదఘట్టనలే మృదంగ ధ్వనులై మ్రోగుచుండగ తల్లి పార్వతీ మణిమయ కుండలములు విచిత్ర రీతిన వెలుగుచుండగ ధరిన భ్రమపడితి భీతిల్లుచు నే పద ఘట్టనలనే పిడుగులై తలచి ఆనందించితి చల్లగాలులకు దివిలోన కాన్పించిన దివ్య కాంతులకు మాయ తొలగించరా భీమలింగేశ్వర కరుణామృత జల్లు నాపైన కురిపి ప్రణమిల్లితి నీకు పాహి పరమేశ్వరా దయజూపి దీవించి నీ దరికి జేర్చరా ~ చలం లక్కాప్రగడ

కర్ణ వియోగం

‌క: దాతా సు: హితుడా క: దాతా, కురు సామ్రాజ్య పట్టాభిషిక్తుడిని చేస్తానని, పాండవ మధ్ముడయిన అర్జున సంహారం చేస్తా అని, కురుక్షేత్ర సంగ్రామ సమయమున నీ అండగా నిలిచి వైరి తలలుతెగతార్చి విజయలక్ష్మీ పంచన చేర్చేదనని ఉత్తర ప్రగల్భాలు పలికి రుధిరరణభూమిన నిస్సత్తువతో నిలబడలేక మృత్యులోగిలికై ఎదురుచూస్తున్న ఈ దుర్భలుని క్షమించగలవా. సు: హితూడా! కుచిత పాండవ కాంత వల్ల జరిగిన అవమాన భారము మేరునగ రీతిన పెరిగినదై, రాజ్య కాంక్ష తో, ధర్మాధర్మ విచక్షణరహితుడనై, నీవెరుంగని జూదమున నిన్నే నిలపి, మాతాపితురులు, పితామహులు, గౌరవ గురువులు, మిత్రులు, సహోదరులు, వేయేల జనుల నడుమ ఏకవస్త్రయైన కాంతను కురులపట్టి ఈడ్చి ఈ కురుక్షేత్రమను మహా దావానలము రగిలించితిని. ఈ ఘాడాగ్నికీలలు కురు సామ్రాజ్య లక్ష్మిని, బంధు భాందవులని, గురువులు గురుపుత్రులని, సహ ఉదరులని, నా మానసంబున నెలవైన నిన్ను దహించి వేయు సమయమున మూగ సాక్షిగా నిలిబడి చూస్తున్న దౌర్భాగ్యుడిని. గాండీవ ధరుని ఎదుర్కొనగల ధనుర్వేదివని ఎరిగి ఈ పాప లంపటములోకి ఈడ్చిన ఈ మిత్రద్రోహి నీ సముఖమున తల వంచి నిలబడి క్షమార్పణ కోరుతున్నాడు. క: అపర సూర్య ప్రకాశుడనై, సహజ కవచ కుండలా జనితుడైన నన్ను గ...

శై'శవం'

భ్రూణహత్యల కాలగతినే దాటివచ్చిన గట్టిపిండం పరంధాముని దీవెనలచే బయటపడిన చిట్టి కమలం లక్ష్మి నెరుగక వదిలి పెట్టిన కరుడుకట్టిన మాతృ హృదయం పచ్చలారని బాల శిశువుకు శైశవo ఒక శవం తల్లి పాలకు నోచుకోని, పిల్ల ఆకలి ఎడుపైతే కుప్పతొట్టేన విసిరికొట్టిన, పాలు పెరుగును ఆరగించి ఆకలెరుగక నిద్రపోయిన చిట్టి శిశువును చూసినట్టి కాలభైరవ రూపమొక్కటి కాపుకై తన జతనుగట్టే చిట్టి శిశువుకు కుక్క తోడై తండ్రి స్థానము తీసుకుంటే బేల చూపుల చిట్టి జాబిలి క్రమము క్రమముగ పెరుగుతుండే పెరుగుతున్న చిట్టి జాబిలి చూడనున్నది గ్రహణం మధువు మరిగిన రాహువొక్కటి రెండు కాళ్ళతో సంచరిస్తూ తప్పటడుగుల శబ్దములతో చిట్టి జాబిలి చెంతజేరే మదపు చెమటల దుడుకు చర్యకు మచ్చలెరుగని చిట్టి జాబిలి నీలమైపోయే, శరీరం చల్లబడిపోయే తెలిసి తెలియని చిన్ని వయసున కన్న ప్రేమకు దూరమై మృగపు ప్రేమను చొరగొన్నా, మనిషి చేష్టకు లోకువై శైశవమునే చిట్టి జాబిలి నేల విడిపోయే శైశవమునే చిట్టి జాబిలి శవము అయిపోయే ~ చలం లక్కాప్రగడ

జీవన సత్యం

  అన్నీ తెలుసు అనుకునే ఓ మనిషీ నీ పయనమెచటికి అన్నిటికీ దేవుడా అంటావు అన్నీ నావే అంటావు కష్టసుఖాలు అన్నీ తెలుసు అంటావు వాటి కుదుపులకు నలుగుతావు ప్రేమంటే ఇవ్వడం అంటావు ఇచ్చింది మళ్ళీ కావాలి అంటావు కాటికి పరుగులు తప్పదు అంటావు ఎప్పటికీ నీ వారితో ఉండాలనుంది అంటావు అంతః సౌందర్యం అందం అంటావు అద్దం లో చూసి మురిసిపోతావు బంధాలు సమయానుగుణంగా మారతాయి అంటావు అవే బంధాలు కనుమరుగు అవుతుంటే కంటి నిండా విలపిస్తావు జీవితమే మాయ అంటూ వల్లిస్తావు అదే మాయా చట్రంలో జీవిత గమనాన్ని వెతుకుతావు అన్నీ తెలుసు అనుకునే ఓ మనిషి జీవన సత్యం తెలుసుకో నేటికి ఒంటరిగా పుట్టిన ఓ మనిషీ చివరంట నీకు నీవే ఎప్పటికీ ~ చలం లక్కప్రగడ